కలం, కోహెడ: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కని, దాన్ని కాలరాయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, అర్హులైన ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.
ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు.. ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కును కూడా కేంద్రం లాక్కుంటోందని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఈసీ వైఖరిని ఎండగడుతున్నా మోదీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఓటరు హక్కును కాపాడేందుకు ‘దేశ్ బచావో.. ఓట్ బచావో’ పేరిట పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

