కలం, నిర్మల్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా మంగళవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనుమానాస్పద ఫోన్ కాల్స్ , సందేశం, లింక్ లేదా ఆన్‌లైన్ ఆఫర్ వచ్చినప్పుడు తొందరపడకుండా ‘PAUSE FOR SAFETY – Pause. Think. Verify’ అనే సందేశాన్ని పాటించాలని సూచించారు. నకిలీ రుణ యాప్‌లు, భారీ డిస్కౌంట్ ఆఫర్లు, ఆన్లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ కస్టమర్ కేర్, సోషల్ మీడియా, యూపీఐ లావాదేవీల పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని కోరారు. తెలియని లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తులకు నగదు పంపడం చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ అధికారులు, ఎస్సైలు శ్రావణి, ముత్యం తదితరులు పాల్గొన్నారు.

