విద్యుత్ డిమాండ్ పెరిగినా.. కోతలు లేవు: భట్టి విక్రమార్క

కలం, పులిచింతల : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ, ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని (Pulichintala Power Plant) పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యంత్రాల పనితీరుపై అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం అది 20 వేల మెగావాట్లకు చేరిందని, పొరుగున ఉన్న పెద్ద రాష్ట్రమైన కర్ణాటక పీక్ డిమాండ్ (20 వేల మెగావాట్లు) స్థాయికి తెలంగాణ చేరగా, ఏపీలో డిమాండ్ 12 వేల మెగావాట్లుగా మాత్రమే ఉందన్నారు.

ఎల్ నినో (El Nino) ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి లభ్యత తగ్గి జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని, దీనికి డిమాండ్ పెరుగుదల తోడై మొత్తంగా 8 వేల మెగావాట్ల అదనపు భారం పడినప్పటికీ, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ నిరంతర సరఫరా అందిస్తున్నాయని అభినందించారు.

గృహ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, రాత్రి వేళల్లో పెరిగే డిమాండ్‌‌ను థర్మల్ పవర్ ద్వారా అధిగమిస్తున్నామని తెలిపారు. జలవిద్యుత్ ప్రాజెక్టులన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ, నీటి కొరత వల్లే ఉత్పత్తి తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి రాకుండా రాబోయే వర్షాకాలం వరకు అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణంలో పాల్గొన్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలకు రూ. 200 కోట్ల చొప్పున కేటాయించి, ఒకే ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన 2,600 మంది విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించేలా అత్యాధునిక సదుపాయాలతో స్కూళ్లను నిర్మిస్తున్నామని వివరించారు.

Also Read : ఏపీ అధికారుల మెరుపు ఆపరేషన్.. పాక్ స్పై నెట్‌‌వర్క్ గుట్టురట్టు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>