యాదాద్రికి ‘నైనీ’ బొగ్గు.. ఇక రోజుకు 16 వేల టన్నులు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని సరఫరాపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. నాణ్యమైన బొగ్గు లేకపోవడం, అవసరానికి తగినంత నిల్వలు లేకపోవడంతో చిక్కుల్లో పడిన యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ (Yadadri Thermal Plant)ను పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ చేయించేందుకు చర్యలు చేపట్టింది.

తెలంగాణ జెన్‌కో సీఎండీ హరీశ్, సింగరేణి సంస్థ కోల్-లాజిస్టిక్స్ డైరెక్టర్ నాగ్య, మరికొందరు అధికారులు ఒడిశాలోని నైనీ కోల్ (Naini Coal)బ్లాక్‌ను సోమవారం సందర్శించారు. నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి సంస్థ ఇటీవల బొగ్గు మైనింగ్ యాక్టివిటీస్ మొదలుపెట్టింది. రాష్ట్ర విద్యుత్, బొగ్గు అవసరాలను పరిగణనలోకి తీసుకున్న జెన్‌కో సీఎండీ.. నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు ప్రతిరోజు 16 వేల టన్నుల చొప్పున నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంపై చర్చించారు.

ఇందుకోసం నైనీ నుంచి యాదాద్రి ప్లాంట్ వరకు అవసరమైన రైల్ రేక్స్ (గూడ్స్ రైలు వ్యాగన్లు), నిరంతరాయంగా సరఫరా చేయడంపై సమీక్షించారు. ఇక నుంచి ప్రతిరోజు 16 వేల టన్నుల చొప్పున బొగ్గు సరఫరా కానున్నట్లు ప్రకటనలో సీఎండీ పేర్కొన్నారు.

సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై సమీక్ష

ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాడ దగ్గరున్న నైనీ బొగ్గు గనులను స్వయంగా పరిశీలించిన జెన్‌కో సీఎండీ యాదాద్రి ప్లాంట్ వరకు రవాణా చేయడంలోని సమస్యలపైనా దృష్టిసారించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా బొగ్గు మైనింగ్ స్పీడప్ చేయడం, ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రైళ్ల ద్వారా తరలించడంలోని ఇబ్బందులను పరిష్కరించడం గురించి సంబంధిత అధికారులతో చర్చించారు.

ప్రతిరోజు పవర్ స్టేషన్‌కు 16,000 టన్నుల బొగ్గును సప్లై చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంపై చర్చించారు. యాదాద్రిలోని థర్మల్ ప్లాంట్ అల్ట్రా-సూపర్‌ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా నెలకొల్పినట్లు వివరించిన జెన్‌కో సీఎండీ హరీశ్… నైనీ కోల్ బ్లాక్ నుంచి సేకరించిన నాణ్యమైన బొగ్గును అందించనున్నట్లు తెలిపారు.

కేవలం బొగ్గు నిల్వలు లేని కారణంగా యూనిట్లు మూతబడడం, ఉత్పత్తి నిలిచిపోవడం, ఆ మేరకు ఇతర వనరుల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి రావడం, విపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం.. వీటన్నింటితో ఈ ప్లాంట్‌ను వీలైనంత తొందరగా పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ చేయించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>