కలం, తెలంగాణ బ్యూరో: పండుగల వేళ ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్ బిల్లులపై ‘ట్రూ-అప్’ ఛార్జీల (True-Up Charges) పేరుతో ప్రజలపై అదనపు భారం మోపింది. నవంబరులో ప్రతి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబరు నుంచి 50 పైసల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయనుంది. దక్షిణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ భారం కొనసాగనుంది. ప్రభుత్వ ప్రతిపాదనకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) సోమవారం అనుమతిచ్చింది.
ఎల్ నినో కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్న వేళ.. కరెంటు బిల్లుపై ఈ అదనపు భారం వినియోగదారులకు మరింత గుదిబండగా మారనుంది. వ్యవసాయ మోటారు పంపుసెట్ల విద్యుత్ వినియోగానికి కూడా ట్రూ-అప్ ఛార్జీలు విధించారు. అయితే, ఈ మొత్తాన్ని రైతుల నుంచి నేరుగా వసూలు చేయకుండా ప్రభుత్వం వారి తరఫున డిస్కంలకు చెల్లించనుంది. ఇందుకోసం సుమారు రూ.214 కోట్లను ప్రభుత్వం భరించనుంది.
మూడు భాషల్లో ప్రచారం
డిస్కంలు ఇకపై జారీ చేసే బిల్లుల్లోనే ట్రూ-అప్ ఛార్జీలను కలిపి వసూలు చేయనున్నాయి. బిల్లులో ప్రత్యేకంగా ఈ ఛార్జీల వివరాలు, వసూలు చేసే విధానం, వర్తించే కాలవ్యవధిని స్పష్టంగా పేర్కొనాలని టీజీఈఆర్సీ ఆదేశించింది. దీనిపై వినియోగదారులకు ముందుగానే అవగాహన కల్పించాలని టీజీఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఈ వివరాలను ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేసింది.
రూ.7,635 కోట్ల వసూళ్లు
ప్రజలపై ట్రూ-అప్ చార్జీల పేరుతో భారం వేసినందున ప్రభుత్వానికి ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి సుమారు రూ. 7,635 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నది. రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లు, ఆదాయ సర్దుబాట్ల పేరుతో ఈ ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు ట్రూ-అప్ కింద రూ.5,186.29 కోట్లు, 2023-24 సంవత్సరానికి ఆదాయ ట్రూ-అప్ కింద రూ.2,448.93 కోట్లు వసూలు చేయనున్నారు.
మొత్తంగా ఈ రెండు రకాల ట్రూ-అప్ ఛార్జీల ద్వారా రూ.7,635.22 కోట్లు ప్రజల నుంచి రాబట్టనున్నారు. డిస్కంలవారీగా చూస్తే.. 2022-23 విద్యుత్ కొనుగోలు ట్రూ-అప్‌లో దక్షిణ డిస్కం వాటా రూ.3,329.97 కోట్లు కాగా, ఉత్తర డిస్కం వాటా రూ.1,856.32 కోట్లు. 2023-24 ఆదాయ ట్రూ-అప్‌లో దక్షిణ డిస్కం రూ.2,335.45 కోట్లు, ఉత్తర డిస్కం రూ.113.48 కోట్లు వసూలు చేయనున్నాయి. మొత్తంగా దక్షిణ డిస్కం పరిధిలో రూ.5,420.23 కోట్లు, ఉత్తర డిస్కం పరిధిలో రూ.1,197.30 కోట్లు రాబట్టనున్నారు.

