కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) మున్సిపాలిటీలో డోర్ నెంబర్ల కేటాయింపు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. యాదగిరిపల్లి వద్ద భవన నిర్మాణాలు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఇంటి పన్ను మదింపు చేసి డోర్ నెంబర్లు కేటాయించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నాలా కన్వర్షన్ అనుమతులు లేకుండానే ఈ ప్రక్రియ చేపట్టారని, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందా? డోర్ నంబర్ల కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్‌ను కోరారు.
మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా..
బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదగిరిపల్లి వద్ద ఖాళీ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా 300 చదరపు అడుగుల భవనాలు ఉన్నట్లు చూపించారని తెలిపారు. ఇంటి పన్నును లెక్కించి, 13-285/5/A/A/1, 13-285/5/A/A/3, 13-285/5/A/A/2 డోర్ నెంబర్లు కేటాయించారన్నారు. అధికారులు స్థల పరిశీలన చేయకుండానే డోర్ నెంబర్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగే వ్యవహారాలను ఉపేక్షించేది లేదన్నారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేష్, సురేష్, ఉపాధ్యక్షులు ఆలేటి కర్ణ, ఓబీసీ జిల్లా కార్యదర్శి దోమట ప్రభాకర్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి దేవ, విజయ్ శ్యాం, ప్రవీణ్ పాల్గొన్నారు.

