కలం, వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోసి (Justice Shyam Kosi) నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతిపై వెళ్లారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి తరువాత సీనియార్టీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ శ్యామ్ కోసిని తాత్కాలిక సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్యాం కోసి పనిచేయడం ఇది రెండో సారి. 2025 జులై నెలలో కూడా అప్పటి సీజే జస్టిస్ సుజయ్ పాల్ కోల్కతా హై కోర్టుకు బదిలీ కావడంతో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అపరేశ్ కుమార్ సింగ్ సీజేగా వచ్చారు. ఇప్పుడు ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లడంతో మరోసారి జస్టిస్ శ్యామ్ కోసికి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు..
తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హై కోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తరువాత గెజిట్ వెలువడనుంది. అనంతరం వీరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జస్టిస్ సునీతా అగర్వాల్ రాకతో అత్యున్నత న్యాయస్థానంలో మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరనుంది.

