కలం, కరీంనగర్ : తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన జీవో నెం 9, 97 అంశాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని, వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ (Karimnagar) లోని గీతా భవన్ చౌరస్తా వద్ద ఆఫీసులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థుల సమస్యలపై చర్చించారు. జీవో 97 ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)తో అనుసంధానం చేసే అంశంపై విద్యార్థుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని తెలిపారు.
పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు, SBTET పరిధి, ECET ద్వారా బీటెక్ లేటరల్ ఎంట్రీ, ఫీజులు, స్కాలర్షిప్లు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా జీవో నెం 9 లో ఫీజు రీయింబర్స్మెంట్ ను DBT విధానం రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
విద్యా విధానాల్లో మార్పులు తీసుకువచ్చే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో సంప్రదింపులు జరపాలని నాయకులు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయవాది శ్రీధర్, నరేష్ యాదవ్, పీడీఎస్యూ రాష్ట్ర కోశాధికారి అంగడి కుమార్, గడ్డం శ్రీకాంత్, అజయ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

