కలం, సినిమా: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. తన పేరును ఎవరూ టైం పాస్ కోసం వాడవద్దని, అలా వాడి తన జీవితానికి అన్యాయం చేయవద్దని ఆయన నెటిజన్లను రిక్వెస్ట్ చేశారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
ఆయన ఎవ్వరి పేరు ప్రస్తావించకుండా రాజకీయాలకు సంబంధించి పలువురిపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తుంటే.. మరికొందరు ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి అంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చేస్తున్న పోస్టులు రాజకీయ వర్గాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అక్టోబర్ 3న బండ్ల గణేష్ (Bandla Ganesh) పరిపాలించేవాడు ఎంత గొప్పవాడైనా.. పక్కన ఉండేవాళ్లు నిజాయితీగా లేకపోతే ఆ పరిపాలన నిలబడదని, నాయకుడి గొప్పతనం కాకుండా అతని పక్కన ఉన్నవాళ్ల నిజాయితీయే అతని అసలైన బలం అని ఓ పోస్టు పెట్టారు. ఇదే సమయంలో ఏపీలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు సీఎం చంద్రబాబుతో విబేధాలు వస్తున్నట్లు పుకార్లు రావడంతో బండ్ల దీని గురించే పోస్ట్ పెట్టారని గుసగుసలు మొదలయ్యాయి.
ఇక తర్వాత అక్టోబర్ 4న ఆదివారం మరో పోస్టు బండ్ల గణేష్ పెట్టారు. దారి ఎంత కఠినమైనదైనా దాటే ధైర్యం తనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా నిలబడే పట్టుదలతో ఉంటానని, ఈ రోజు కాకపోయినా, రేపు విజయం తనదేనన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. నిజాయితీయే తన బలం అని, నమ్మకమే తన ఆయుధం అని, విజయం వరకు పోరాటమే తన ప్రయాణం అని రాసుకొచ్చారు.
అసలు బండ్ల గణేష్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో నేడు ఆయన మరో పోస్టు పెట్టారు. దయచేసి మీ టైమ్‌పాస్ కోసం తన పేరు ఎవరూ వాడవద్దని, తన జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, మరే విషయాల మీదా ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదన్నారు. లేనిపోని విషయాలు మాట్లాడి తన పేరును ఉపయోగించి తనకు ఇబ్బందులు కలిగించొద్దని రిక్వెస్ట్ చేశారు. దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన టీటీడీలో పదవి ఆశిస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read : మెస్సీ చివరి మ్యాచ్‌కు రెడీ!
Follow Us On: X(Twitter)

