కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి మూడో వార్డులో ఎలాంటి నిర్మాణాలు లేని సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో మూడు ఇంటి నంబర్లు కేటాయించడంపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఆదివారం సదరు స్థలాన్ని సందర్శించిన ఆయన, మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో నిబంధనలు పాటించారా అనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇటీవల మున్సిపల్ చైర్మన్ తమది ఆదర్శ మున్సిపాలిటీ అని, అవినీతికి తావులేదని, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అవినీతిని నిరూపించాలని సవాల్ చేశారని తెలిపారు. ఆ సవాల్‌ను స్వీకరిస్తూ యాదగిరిపల్లిలోని ఈ వ్యవహారాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. తమ పరిశీలన ప్రకారం ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ స్థలానికి 13-285/5/A/A/1, 13-285/5/A/A/2, 13-285/5/A/A/3 అనే మూడు ఇంటి నంబర్లు ఆగస్టు 7న ప్రస్తుత కమిషనర్ బార్ల శ్రీనివాస్ కేటాయించినట్లు కర్రే ప్రవీణ్ పేర్కొన్నారు. ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా ఖాళీ ప్రదేశానికి ఇంటి నంబర్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు.
ఈ ఇంటి నంబర్ల కేటాయింపులో రూ.4.75 లక్షలు తీసుకున్నారన్న ప్రచారం ప్రజల్లో జరుగుతోందని కర్రే ప్రవీణ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా ఇంటి నంబర్లు కేటాయించారా లేదా అన్నదానిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వెంటనే సదరు ఇంటి నంబర్ల కేటాయింపుపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే వాటిని రద్దు చేయాలని కోరారు. రానున్న పది రోజుల్లో మున్సిపాలిటీలో ఒక్కో అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని కర్రే ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు చిత్తర్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పలుగుల సురేష్, వంశీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

