కలం, వెబ్ డెస్క్: వీడియో మార్ఫింగ్ ఘటనపై స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ స్టాలో పెట్టిన సుదీర్ఘ పోస్టులో ఇలాంటి వీడియోలు పెడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్‌లో పేర్కొన్న ప్రకారం.. ‘ఏఐ(AI)ని దుర్వినియోగం చేస్తూ.. మహిళలను వస్తువులుగా భావిస్తూ.. వారి అనుమతి లేకుండా ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ రూపొందించడం.. లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి దారుణమైన అనుభవాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళను గౌరవించడం, ఆమె అనుమతి కోరడమనేది మనుషుల ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. ప్రస్తుత రోజుల్లో అవే అత్యంత క్లిష్టమైన అంశాలుగా మారిపోతున్నాయి’ అని పేర్కొన్నారు.
ఆ హక్కు ఎవరికీ ఉండదు..
ఒక విషయంలో మహిళ అయిదు రోజుల పాటు అంగీకారం తెలిపినా.. ఆరో రోజు ఆమె నో చెప్పిందంటే దాన్ని కూడా గౌరవించాల్సిందేనని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు. ‘ప్రతి మహిళకు తనకు నచ్చిన దుస్తులను ధరించే హక్కు ఉంది. అంతమాత్రాన ఆమెను ఇచ్చిమొచ్చినట్లుగా కెమెరాలు పెట్టి, అసభ్యకరంగా చూపించేందుకు, వీడియోలు చిత్రీకరించుకునేందుకు అనుమతించినట్లు కాదు. ప్రతి మహిళకు తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుంది. ఆమె తీసుకునే నిర్ణయాల విషయంలో వేరే వాళ్లకు ఎలాంటి హక్కు ఉండదు. కేవలం ఏఐ వీడియోలతో మాత్రమే కాకుండా, ఇటీవల తాను కెరీర్ పరంగా ఎన్నో అనుభవాలను కలిపి చూస్తే చాలా పెద్ద సమస్యగా కనిపిస్తోంది’ అన్నారు.
మనుషులుగా గుర్తించాలని వేడుకోవాలా..?
మహిళలను కనీసం మనుషులుగా గుర్తించమని సమాజాన్ని వేడుకోవాలా..? అని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న శారరీక భయాలను కూడా సరిగ్గా పరిష్కరించకపోతున్నాం. మీ కుమార్తెను కాపాడుకోండి అని హెచ్చరించడం కాదు, ఇతరుల గౌరవాన్ని భంగం కలిగించే కలిగించే హక్కు మనకు ఉందనే భ్రమ నుంచి ప్రజలు బయటపడాలి. ప్రతి మహిళకు తప్పు, ఒప్పు అని స్పష్టంగా చెప్పే నైతిక విలువలు ఉన్న వారు ఈ మార్పులో భాగస్వామ్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్, చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు..
ఈ ఘటనను ఖండిస్తూ ఎన్టీఆర్ (NTR) తీసుకున్న బలమైన వైఖరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు జాన్వీ కపూర్ తెలిపారు. ‘ఆయనకు నేరుగా సంబంధం లేకపోయినా.. ఈ అంశంపై వెంటనే స్పందించి, మహిళల సమస్యకు మద్దతు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, విజయ్, ఖుష్బూ వంటి అగ్ర నటులు కూడా ఖండించడం, ఇలాంటి కంటెంట్ ప్రచారం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. చివరగా ఒక సందేశంతో ముగించాలనుకుంటున్నా. ఆమె శరీరం.. ఆమె వ్యక్తిగతం, ఆమె హద్దులు.. ఆమె ఎంపిక’ అని పేర్కొన్నారు.
Also Read : దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోండి.. మోదీకి కవిత రిక్వెస్ట్
Follow Us On: X(Twitter)

