కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మార్ఫింగ్ వీడియో ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ‘దేవర’ మూవీలోని ‘చుట్టమల్లె’ పాటలో జాన్వీ కపూర్ కనిపించిన తీరుని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన దుండగులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సైతం తీవ్రంగా స్పందించారు. ఆడవాళ్లను దేవతలుగా పూజించే మన దేశంలో వారి గౌరవానికి భంగం కలిగించేలా ఏఐ ఉపయోగించి కొందరు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మార్ఫింగ్ వీడియో చేసిన నీచులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని.. చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు కూడా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎవరు పోస్ట్ చేశారు.. ?
జాన్వీ కపూర్‌పై అసభ్యకరంగా వీడియో రూపొందించిన వైనంపై ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోస్ట్ చేసిన వ్యక్తులను గుర్తించి వెంటనే గుర్తించి వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పలువురు హీరోలు డిమాండ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోల భూతం సినిమా ఇండస్ట్రీని మొదటి నుంచీ వెంటాడుతూనే ఉంది. గతంలో కూడా పలువురు హీరోయిన్ల వీడియోలను మార్ఫింగ్ చేసిన కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలోకి వదిలారు. అదంతా ఫేక్ అని హీరోయిన్లు పలుమార్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా, జాన్వీ కపూర్‌పై కూడా అలాంటి వీడియోను రూపొందించి వదలడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

