కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగం వేసిన పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిందని.. చివరి తడి వరకు నీటిని అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు.
ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, పొలాల్లో ఉన్న పంటలను ఎండనివ్వకుండా కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తుమ్మల (Tummala Nageswara Rao) పేర్కొన్నారు. రైతుల విన్నపాలు, పంటల సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు మళ్లించి చివరి తడి వరకూ నీటిని అందిస్తామని తెలిపారు.
లభ్యతలో ఉన్న గోదావరి జలాలను అందుబాటులో ఉన్న అవకాశంగా భావించి రైతులు అత్యంత పొదుపుగా వాడుకోవాలని, ఎక్కడా నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సాగునీటి పర్యవేక్షణపై యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పునరుద్ఘాటించారు.

