కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో వీసా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నివాసముంటున్న విదేశీయులపై (Illegal Foreigners) హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆగస్టు 31 నుంచి నగరం వ్యాప్తంగా సాగిన ఈ నిరంతర తనిఖీల్లో మొత్తం 49 మంది అక్రమ విదేశీయులను అధికారులు గుర్తించారు.. వీరిలో అత్యధికంగా టోలిచౌకి ప్రాంతంలో 30 మంది, లంగర్‌హౌస్, మెహదీపట్నంలో 6 చొప్పున పట్టుబడ్డారు. గుర్తించిన వారిని హోల్డింగ్ సెంటర్లకు తరలించగా, ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి 12 మందిని స్వదేశాలకు డిపోర్ట్ (నగర బహిష్కరణ) చేశారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా కేవలం వీసా గడువు ముగియడమే కాకుండా పలు నేరపూరిత కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో గంజాయి విక్రయాలు, నకిలీ కరెన్సీ, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులను పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన టూరిస్ట్ వీసాతో ఉంటున్న ఒక కెన్యా దేశపు మహిళ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. అలాగే అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు సౌత్ సుడాన్ పౌరులకు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా గంజాయి పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు స్టూడెంట్ వీసా గడువు ముగిసిన కొందరు ఆస్పత్రుల్లో అక్రమంగా ట్రాన్స్‌లేటర్లుగా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు తేల్చారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో అక్రమ నివాసాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే విదేశీయులకు ఇళ్లు, గెస్ట్ హౌస్‌లు లేదా అపార్ట్‌మెంట్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పాస్‌పోర్ట్, వీసా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అలాగే వారి వివరాలను పోలీసులకు సమర్పించాలని ఇంటి యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమార్కులకు ఆశ్రయం ఇస్తే యజమానులపై కూడా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

