కలం, వెబ్డెస్క్: యూపీలోని ఆగ్రా-అలీగఢ్ హైవేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా-అలీగఢ్ హైవే (Agra-Aligarh Highway) పై రెండు భారీ ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇరు వాహనాల నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఒక వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకుపోయారు. బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో ఇద్దరూ వాహనంలోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రమాదంతో హైవేపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. ఒక ట్రక్కు ఆగ్రా వైపు నుంచి వస్తుండగా, మరొకటి అలీగఢ్ వైపు వెళ్తోంది. రెండు వాహనాలు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడమే ప్రమాద తీవ్రతకు కారణమని పోలీసులు వెల్లడించారు.

