కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కోర్టు డ్యూటీ అధికారులు లైసెన్ అధికారులు సమన్వయంతో పనిచేసి కేసుల విచారణ త్వరగా పూర్తి అయ్యేటట్లు చూడాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) అన్నారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో జిల్లా ఎస్పీ జానకి, సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి కోర్టు విచారణలు, పెండింగ్‌లో ఉన్న కేసులు, సాక్షుల హాజరు, చార్జిషీట్‌ల దాఖలు, కోర్టు ఉత్తర్వుల అమలు తదితర అంశాలపై ఎస్పీ సమీక్షించారు. కేసుల దర్యాప్తు పూర్తయిన అనంతరం చట్టపరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, కోర్టుల్లో కేసుల విచారణ సజావుగా జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు (Court Duty Officers) , లైజన్ అధికారులు సంబంధిత పోలీసు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కోర్టు కేసులకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను పకడ్బందీగా నిర్వహించాలని, కోర్టు నుండి వచ్చే సమన్లు, వారెంట్లు, ఉత్తర్వులను సకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. న్యాయస్థానాల్లో కేసుల సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌కు అవసరమైన పూర్తి సహకారం అందిస్తూ, కేసుల్లో నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎంబి రత్నం, డీసీఆర్‌బీ డీఎస్‌పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్‌పీ బాలాజీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవి బాబు, డిటిసి ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి, కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు.

