కలం, భువనగిరి: ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) స్పష్టం చేశారు. వలిగొండ (Valigonda) లోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా తమ గ్రామాల్లో ఎదురవుతున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలతో పాటు మౌలిక వసతుల కల్పన, చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనుల గురించి ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. బాధితుల వినతులను ఓపికగా విన్న ఎమ్మెల్యే, వెంటనే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల తీవ్రతను వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యల తీవ్రతను పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు తాను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

