కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామ శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Khammam Road Accident) చోటుచేసుకుంది. గాయపడిన క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందిస్తూనే, మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి నేరుగా కోయచలక–రఘునాథపాలెం రహదారిపై ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కూలీలతో వెళ్తున్న ఆటోను రేగుచలక సమీపంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టిన ఈ దుర్ఘటన (Khammam Road Accident)లో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఖమ్మం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రహదారి నిర్మాణం, అక్కడ ఉన్న ప్రమాదకర మలుపులు, వాహనాల రాకపోకల తీవ్రత, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సాంకేతికంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ.. రహదారిపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను వెంటనే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే లైటింగ్ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా పోలీస్, ఆర్‌అండ్‌బీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

