కలం, ఖమ్మం బ్యూరో: ఆదివాసీ భాషలకు పూర్వవైభవం తీసుకురావాలని, గోండి–కోయ భాషా పదాలు, అక్షరాలు, మూలాలను సమగ్రంగా గుర్తించి భాషను ప్రామాణికీకరించాల్సిన అవసరం ఉందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం గిరిజన భవనంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌తో కలిసి తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో ‘గోండి–కోయ నిఘంటువు వర్క్‌షాప్’ను ప్రారంభించారు. తొలుత గోత్రాల జెండాను ఆవిష్కరించి, గాంధీజీతో పాటు ఆదివాసీ మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు.
ప్రామాణికం చేస్తే ప్రత్యేక గుర్తింపు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న గోండి–కోయ తెగల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రాచీన మూలాలను గుర్తించి ప్రామాణికం చేస్తే భాషకు అధికారిక, ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్ మాట్లాడుతూ.. ఆదిమ జాతుల భాషలు, సంస్కృతులు కనుమరుగు కాకుండా ప్రతి ఒక్కరూ పిల్లలకు కోయ భాషను నేర్పించాలని కోరారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రాథమిక విద్య, రేల పాటల ఆల్బమ్, మ్యూజియం పునరుద్ధరణ, పురాణ కథల గ్రంథస్తం వంటి కార్యక్రమాల ద్వారా భాషా పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

