కలం, వెబ్ డెస్క్: సూపర్ ఎల్ నినో ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా నీళ్లను ఒడిసిపట్టకుండా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ రాష్ట్రాన్ని కరువులోకి నెట్టారని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఫైర్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లున్నా సద్వినియోగం చేసుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. కేసీఆర్ ముందుచూపుతో ప్రాణహిత మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా కాళేశ్వరం కట్టారని కొనియాడారు. కానీ కేసీఆర్కు పేరొస్తుందని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తడం లేదని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రేవంత్ రెడ్డి కావాలనే పక్కన పెట్టారని దుయ్యబట్టారు.
రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా రాష్ట్రాన్ని కరువులోకి నెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రబీ సీజన్ లో కూడా పూర్తి స్థాయి సాగుకు అవకాశం ఉందని.. రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. విద్యార్థులకు భోధనా రుసుము వాయిదా వేయాలని.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డులున్న కుటుంబాలకు నెలకు వెయ్యి రూపాయల సాయం అందించాలని కోరారు. విద్యుత్ సంక్షోభంతో కాళేశ్వరం లాగే యాదాద్రి పవర్ ప్లాంట్ విలువ ఇపుడు తెలిసొస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా రాష్ట్రాన్ని కరువు బారి నుండి కాపాడాలని కోరారు.

