కలం, యాదగిరిగుట్ట: వంగపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం VB-GRAM-G వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై గ్రామసభలో చర్చించారు.
గ్రామ ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన అభివృద్ధి పనులను ప్రణాళికలో చేర్చాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో VB-GRAM-G వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికను రూపొందించి, గ్రామ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. ఈ గ్రామసభలో పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

