వేండికోల్ లో అక్రమ మట్టి దందా..!

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా చౌటకుర్ మండలం వేండికోల్ గ్రామంలోని కాముని చెరువు (సర్వే నంబర్ 275) నుంచి గత కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, మొరం రవాణా జరుగుతోంది. లింగంపల్లి రోడ్డు నిర్మాణ పనుల నెపంతో చెరువులో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల చెరువు రూపురేఖలు మారి పెద్ద పెద్ద గుంతలుగా తయారవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో గ్రామస్తులు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, సీజ్ చేసిన టిప్పర్లను పోలీస్ స్టేషన్‌‌కు తరలించకుండా, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నేషనల్ హైవే 161 పైనే వదిలి వెళ్లడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు అక్రమ మైనింగ్ పై వ్యవహరిస్తున్న తీరుపై వేండికోల్ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ గ్రామ చెరువు నుండి అక్రమ రవాణాపై వేండికోల్ గ్రామ సర్పంచ్ గిరంగారి మల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు చౌటకుర్ ఎంఆర్‌వో వినతిపత్రం సమర్పించారు. కాముని చెరువు సర్వే నంబర్ 275 నుండి మట్టి అక్రమ రవాణాను వెంటనే అడ్డుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్, గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>