కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న కరీంనగర్ కు రానున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమావేశం నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
అమిత్ షా పర్యటనలో (Amit Shah Karimnagar Visit) భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రదేశాలు, హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రతా విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రతి అంశాన్ని ముందుగానే సమగ్రంగా పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సీపీ గౌష్ ఆలం సూచించారు.
ప్రతిమ మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంతో పాటు ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, సిల్వర్ జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది అలాగే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ప్రతిమ మెడికల్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

