చైనా చిత్తు.. 44 ఏళ్ల తర్వాత భారత్‌కు పసిడి

కలం, స్పోర్ట్స్​ : ఆసియా గేమ్స్‌(Asian Games)లో భారత మహిళల హాకీ జట్టు (India Women Hockey Team) దుమ్ము రేపింది. ఫైనల్ మ్యాచ్‌లో డ్రాగన్ కంట్రీని చిత్తు చేసింది. ఈ విజయంతో 44 ఏళ్​ల పసిడి నిరీక్షణకు కూడా భారత జట్టు తెరదించింది. అంతేకాకుండా ఈ పతకంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలిపింక్స్‌కు కూడా అర్హత సాధించింది భారత జట్టు. ఆసియన్ గేమ్స్ మహిళల హాకీలో 1982లో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం దక్కలేదు. ఆ నిరీక్షణకు ఇప్పుడు భారత జట్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. గోల్డ్ ఫైట్‌లో చైనా, భారత్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.

నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఈ పోరులో చైనానే బాల్‌ను ఎక్కువ సేపు తన హ్యాండ్‌లో ఉంచుకుంది. భారత సర్కిల్‌లోకి చాలాసార్లు ఎంటర్ అయినప్పటికీ.. గోల్ చేసే అవకాశాన్ని భారత్ ఇవ్వలేదు. 10వ నిమిషంలో భారత్‌కు కీలక గోల్ వచ్చింది. సలీమా టెటే చేసిన దాడిని సాక్షి ముందుకు తీసుకెళ్లింది. ఆమె ఇచ్చిన పాస్‌ను లాల్‌రెమ్సియామి అందుకుంది. రివర్స్ హిట్‌తో బంతిని నెట్‌లోకి పంపింది. భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చైనా ఒత్తిడి పెంచింది. రెండో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్లతో భారత్‌ను ఇబ్బంది పెట్టింది. 23వ నిమిషంలో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ కూడా లభించింది.

భారత్ కెప్టెన్ సవిత పూనియా కీలక సమయంలో అడ్డుగా నిలిచింది. ఒక చేత్తో అద్భుతంగా బంతిని ఆపింది. చైనాకు సమం చేసే అవకాశం దక్కకుండా చేసింది. మూడో క్వార్టర్‌లోనూ చైనా ఆధిపత్యం కొనసాగింది. భారత్ (India Women Hockey Team) ఎక్కువసేపు రక్షణలోనే కనిపించింది. సలీమా టెటే కూడా కీలక బ్లాక్‌లు చేసింది. అయితే వేలు గాయంతో కొద్దిసేపు బయటకు వెళ్లింది. చివరి క్వార్టర్‌లో చైనా మరింత ఒత్తిడి తెచ్చింది. సలీమా మళ్లీ మైదానంలోకి వచ్చింది. భారత్ మాత్రం రక్షణను మరింత గట్టిగా చేసింది. మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాలకుపైగా ఉండగా చైనా గోల్‌కీపర్‌ను బయటకు తీసింది. అదనపు ఆటగాడిని మైదానంలోకి పంపింది. అయినా భారత్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

చివరి నిమిషంలోనూ చైనా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. సవిత మరోసారి కీలకంగా నిలిచింది. భారత రక్షణ చివరి వరకు గట్టిగా నిలిచింది. చివరి విజిల్ మోగడంతో భారత్ 1-0 విజయాన్ని ఖాయం చేసుకుంది. 44 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో ఆసియా గేమ్స్ స్వర్ణాన్ని అందుకుంది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా బెర్త్ కూడా దక్కింది. చైనాపై గతంలో ఎదురైన ఓటమికి ఈ విజయం మరో సందర్భంలో సమాధానంగా నిలిచింది. ఫైనల్లో భారత్ చూపిన పట్టుదలతో చారిత్రక స్వర్ణం సొంతమైంది.

Also Read : విద్యుత్ వెలుగుల్లో సరికొత్త విప్లవం.. తెలంగాణలో బీఈఎస్ఎస్ అభివృద్ధి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>