కలం, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇటీవల ఏపీ హైకోర్టు ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయడంతో, ఆ తీర్పును సవాల్ చేస్తూ శనివారం మధ్యాహ్నంలోగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీకి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల వాదనలను సమర్థవంతంగా వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాదులను నియమించాలని అధికారులకు సీఎం సూచించారు. అంతేకాదు ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయనిపుణులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి, పిటిషన్ రూపకల్పన, న్యాయపరమైన అంశాలపై కీలక సూచనలు చేసినట్లు సమాచారం అందుతోంది. దీంతో రేపు మధ్యాహ్నం పిటిషన్ దాఖలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోనే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

