కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బస్ డిపో సమీపంలో ఉన్న సంతోషిమాత దేవాలయం (Dilsukhnagar Temple)లో కలకలం రేగింది. ఒక గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని కర్రలతో కొడుతూ ధ్వంసం చేసేందుకు యత్నించాడు.
ఈ దృశ్యాన్ని గమనించిన ఆలయ పూజారి స్పందించి నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ దుండగుడు పూజారిపై కర్రలతో దాడికి తెగబడ్డాడు. పూజారిపై జరుగుతున్న దాడిని ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
భక్తులు ఆ దుండగుడిని పట్టుకుని తాడుతో కట్టేశారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

