కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రజా సమస్యలకు సమాధానాలు చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారహీనమైన భాషకు, పరిపాలనా వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.
సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను(Sircilla Remarks) ఖండిస్తూ పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోందని, ఆ భయం, ఆక్రోశంతోనే రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి గౌరవం, సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి అబద్ధాలు, విద్వేషాలు, వ్యక్తిగత దూషణలతో కాలక్షేపం చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం.. తమ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని బురదజల్లే కుట్రలు చేస్తోందని ఎండగట్టారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

