కలం, వెబ్ డెస్క్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ దేవాలయ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత (Gongidi Sunitha) మండిపడ్డారు. యాదగిరిగుట్టను కేసీఆర్ అద్భుతంగా రూ.1,300 కోట్లతో తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలిపారని కొనియాడారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా విలువ ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఈఓ ఓ కరపత్రం విడుదల చేశారని గొంగిడి సునీత తెలిపారు. దాతలు కావలెను అని రోడ్ల మీద తిరిగుతున్నారని.. ఇది విచారకరమని పేర్కొన్నారు.
కేసీఆర్ ఎపుడూ దాతల సాయం కోరలేదని.. ఆలయం పూర్తయిన తర్వాత బంగారం తాపడం కోసం మాత్రమే కేసీఆర్ దాతల సాయం కోరారని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కరపత్రం తెచ్చిన ఈఓపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రూ.43 కొట్లతో వేద పాఠశాల కోసం కేసీఆర్ 2023లో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత మే నెలలో మళ్ళీ అవే పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని.. ఆ పనులకు కూడా దాతల సాయం కోరుతారా? అని ప్రశ్నించారు.
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారని గొంగిడి సునీత తెలిపారు. తమ ఆరోపణలపై వెంటనే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట(Yadagirigutta) దేవాలయ ప్రతిష్టను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పక్షాన తాము ఎంత దూరమైనా వెళతామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని.. ప్రభుత్వం నుంచి సమాధానం రాకుంటే మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

