సీఎస్‌కే కు కొత్త బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ

కలం, స్పోర్ట్స్ : చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు బౌలింగ్ కోచ్‌ (CSK Bowling Coach) గా భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma) బాధ్యతలు చేపట్టనున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతారని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. జట్టు ప్రధాన కోచ్ జహీర్ ఖాన్ మోహిత్ పేరును సిఫార్సు చేశారని ఆయన తెలిపారు. ఆటగాడిగా మోహిత్ సేవలు అద్భుతమని, కోచ్‌గా కూడా ఆయన మెరుగ్గా రాణిస్తారని విశ్వనాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మిగిలిన సపోర్ట్ స్టాఫ్‌ను కూడా జహీర్ సిఫార్సులతోనే త్వరలో ఎంపిక చేస్తామని వెల్లడించారు.

మోహిత్ శర్మ గతంలో సీఎస్‌కే తరఫున నాలుగు సీజన్లలో ఆడిన అనుభవం కలిగి ఉన్నాడు. ప్రస్తుత నియామకంతో ఆయన గతంలో బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఎరిక్ సిమన్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 120 మ్యాచ్‌లు ఆడిన మోహిత్, 134 వికెట్లు పడగొట్టాడు. సీఎస్‌కే కాకుండా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు సీజన్లలో 41 వికెట్లు తీసి తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున మోహిత్ 26 వన్డేలు, 8 టి20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 31, 6 వికెట్లు సాధించాడు. 2015 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అలాగే 2014 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే తరఫున 23 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో మోహిత్ శర్మ అన్ని రకాల వృత్తిపరమైన క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు.

హర్యానా నుంచి ప్రారంభమై భారత జెండా ధరించడం, ఐపీఎల్‌లో ఆడటం వరకూ తన ప్రయాణం ఒక వరమని రిటైర్మెంట్ సమయంలో మోహిత్ భావోద్వేగంగా పేర్కొన్నారు. తన కెరీర్‌కు వెన్నుముకగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, తనకు నిరంతరం మార్గదర్శనం చేసిన అనిరుధ్ సర్, బీసీసీఐ, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. ఆటగాడిగా ఘనమైన అనుభవం ఉన్న మోహిత్ శర్మ చేరికతో సీఎస్‌కే బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>