కలం, వెబ్ డెస్క్ తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఇటీవల నిరసన వ్యక్తం చేసిన వేళ చోటు చేసుకున్న ఘటనలపై హైకోర్టు (Telangana High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన సందర్భంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులను తక్షణమే గుర్తించాలని డీజీపీని ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తన సరికాదని, భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసేలా ప్రవర్తించడం పద్ధతి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
శాసనసభ పరిసరాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల వివరాలను సేకరించి, వారిపై తీసుకున్న చర్యల నివేదికను అసెంబ్లీ స్పీకర్ ముందర ఉంచాలని డీజీపీకి హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. అసెంబ్లీ ఆవరణలో శాంతిభద్రతల నిర్వహణ లేదా ఆంక్షల అమలు అనేది స్పీకర్ పరిధిలోని అంశమని హైకోర్టు (Telangana High Court) గుర్తు చేసింది. పోలీసు అధికారులు కేవలం స్పీకర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే ప్రవర్తించి ఉంటే, ఆ వ్యవహారం స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని వ్యాఖ్యానించింది.
అయితే స్పీకర్ ఆదేశాలను దాటి పోలీసులు తమ పరిధిని మించి ప్రవర్తించి, మహిళా ఎమ్మెల్యేల పట్ల అసంబద్ధంగా వ్యవహరించి ఉంటే అది తీవ్రమైన విషయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. చట్టప్రకారం బాధ్యులైన సిబ్బందిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ కోసం సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.
Also Read : ములుగు గట్టమ్మ ఆలయంలో “ది ప్యారడైజ్” చిత్ర బృందం ప్రత్యేక పూజలు
Follow Us On : WhatsApp

