కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) తీవ్ర కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని మణికొండలో ఓ చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే ఏపీలో మరో చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించింది.
ధర్మవరంలోని ఏకంగా నాలుగు ఇళ్లను చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేసింది. తెల్లవారుజామున ఇళ్ల కిటీకి తలుపులను పగలగొట్టేందుకు దుండగులు యత్నించారు. అయితే ఆ సమయంలో యజమానులు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. సమచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను చూసిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. కాగా, చెడ్డీ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అంటున్నారు. రాత్రి సమయంలో ఇంట్లో ఉన్నప్పటికీ బాల్కనీ, టెర్రస్ ప్రవేశ ద్వారాలు , తలుపులు, కిటికీలు లాక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

