కలం, కరీంనగర్: స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య రక్షణే ధ్యేయంగా సోమవారం కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో ‘శాతవాహన గ్రామీణ సంత’ (Satavahana Rural Market) ఘనంగా ప్రారంభమైంది. గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గ్రామీణ సంత నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ ప్రదర్శనలో వివిధ రకాల గ్రామీణ ఉత్పత్తులతో కూడిన మొత్తం 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాలు, సేంద్రియ (ఆర్గానిక్) ఆహార పదార్థాలు, మట్టి పాత్రలు, హస్తకళలు, మూలికా ఆరోగ్య ఉత్పత్తులు ఈ సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా సీనియర్ సిటిజన్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల కేశవ రెడ్డి, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశీయ ఉత్పత్తులను ఆదరించడం ద్వారా స్థానిక చేతివృత్తుల వారికి, గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో రసాయనాలకు దూరంగా ఉంటూ, ప్రకృతి సిద్ధమైన స్వదేశీ వస్తువులను వాడటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇలాంటి పర్యావరణ హిత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామీణ సంత కరీంనగర్ ప్రజలకు నూతన అనుభూతిని పంచుతుందని, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రామీణ కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ సంయోజక్ జిన్నా సత్యనారాయణ రెడ్డి, సహకార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శంకరయ్య , గ్రామ భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ గాలి పెళ్లి నాగేశ్వర్, ప్రధాన కార్యదర్శి కూర్మాచలం మునిందర్, ఉపాధ్యక్షులు క్యాస మధు, కార్యదర్శి గొల్లె తిరుపతి శివనాథుల స్వప్న, గ్రామ వికాస్ జిల్లా సంయోజక్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

