కలం, స్పోర్ట్స్ : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన అప్డేట్ ఇచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ (Ellyse Perry) రాబోయే సీజన్లో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఆమె రాకతో జట్టు అన్ని విభాగాల్లో మరింత బలంగా మారిందని హెడ్ కోచ్ మలోలన్ రంగరాజన్ స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో పెర్రీ 2026 సీజన్‌కు దూరమయ్యారు. ఈ ఏడాది ఆగస్టులోనే తాను ఆర్సీబీకి ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె యాజమాన్యానికి తెలియజేశారు.
పెర్రీ (Ellyse Perry) తిరిగొస్తుండటంతో జట్టు రిటెన్షన్ వ్యూహం సులభమైందని కోచ్ వివరించారు. రిటెన్షన్ గడువు ముగిసే సమయానికి ఆర్సీబీ మొత్తం 13 మంది ఆటగాళ్లను తమతోనే ఉంచుకుంది. ఇందులో తొమ్మిది మంది భారతీయ ఆటగాళ్లు, నలుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. దయాలన్ హేమలత, గౌతమి నాయక్, లిన్సే స్మిత్, గ్రేస్ హారిస్‌లను జట్టు నుంచి వేరు చేసింది. గత ఛాంపియన్షిప్ విజయంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారని, వారి సేవలకు కోచ్ రంగరాజన్ కృతజ్ఞతలు తెలిపారు.
కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లర్క్, రాధా యాదవ్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, కె ప్రత్యూష, సాయలీ సత్ఘారే, పూజ వస్త్రాకర్, జార్జియా వోల్లను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. పెర్రీ స్థానం ఖరారవ్వడంతో వేలంలో జట్టు సమతుల్యతను ఎలా మెరుగుపరచుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కోచ్ తెలిపారు.
మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ 2027 జనవరి 14 నుండి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. దీనికి ముందు అక్టోబర్ 28న కొచ్చిలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. వేలంలో ఆర్సీబీ రూ. 1.15 కోట్ల నిధితో బరిలోకి దిగుతోంది. గతాన్ని మర్చిపోయి, ఈ వేలంలో మరింత బలమైన జట్టును నిర్మించడమే తమ లక్ష్యమని యాజమాన్యం చెబుతోంది.

