అవినీతికి కేరాఫ్‌గా ఇందూరు బల్దియా: ఎమ్మెల్యే ధన్‌పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ కార్పొరేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) మండిపడ్డారు. ప్రతి బడ్జెట్‌లో రూ.కోట్లు కేటాయిస్తారు కానీ, పనుల కోసం రూపాయి ఖర్చు చేయరని మండిపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ కార్పొరేటర్లు సోమవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం ఒక ఎమ్మెల్యేనే ధర్నాకు కూర్చున్నారంటేనే ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్పొరేషన్‌కు రూ.150 కోట్ల ఆదాయం, రూ.94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా రూపాయి ఖర్చు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. పదేళ్లు పాలించినా బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేకపోయిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడే చెప్పినా..

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామన్నారని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుర్తు చేశారు. ఇప్పటివరకు నిధులు మాత్రం విడుదల చేయలేరన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడి మేయర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నగర ప్రజలకు నిధులు కాగితాలపై కనిపించడం అవసరం లేదని.. చేసే పనులు కనిపించాలని సూచించారు. కమిషనర్‌కు లేఖలు అందించినా స్పందించడం లేదన్నారు. డివిజన్ల అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించినా.. ఒక్క డివిజన్‌కు కూడా రూపాయి కేటాయించలేదన్నారు.

కార్పొరేషన్ ముట్టడి ఉద్రిక్తత..

నిజామాబాద్ ధర్నాచౌక్‌లో ధర్నా అనంతరం మ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదని బైఠాయించారు. అనంతరం కమిషనర్ దిలీప్ కుమార్ రావడంతో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో 28 మంది కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ఆయా మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>