జూన్ 2028 నాటికి SLBC టన్నెల్ పూర్తి: మంత్రి ఉత్తమ్

కలం, మిర్యాలగూడ: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్.వి గార్డెన్స్‌లో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కోటి 6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు.

అదనంగా 10,168 కార్డులు మంజూరు..

రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 48 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 15,000 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో 86,960 రేషన్ కార్డులు ఉండగా, జనవరి 2025 నుంచి ఇప్పటివరకు అదనంగా 10,168 కార్డులు మంజూరు చేశామన్నారు. దీంతో నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డుల సంఖ్య 1,00,526కి చేరిందని, సన్న బియ్యం లబ్ధిదారుల సంఖ్య 2,98,590కి పెరిగిందని వివరించారు.

రాబోయే వేసవి వరకు తాగునీరు..

నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడటంతో పాటు రాబోయే వేసవి వరకు ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని 6 లిఫ్ట్ ఇరిగేషన్లకు రూ. 175 కోట్లు మంజూరు చేసి పనులను వేగవంతం చేశామని, తమ హయాంలోనే వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. దున్నపోతుల గండి, బత్తలపాలెం, కేశవాపురం, వీర్లపాలెం, నెల్లికల్ ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు.

త్వరలోనే ప్రోజెక్టుల పూర్తి..

బ్రాహ్మణ వెల్లేముల, ఉదయ సముద్రం, ఐటిపాముల, నక్కలగండి, డిండి ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా జూన్ 2028 నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

మిర్యాలగూడ అభివృద్ధికి హామీలు..

అర్హత ఉన్న ప్రతి గ్రామానికి చౌక ధరల దుకాణం (రేషన్ షాప్) మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కళాశాల పనులను వేగవంతం చేస్తామని, మిర్యాలగూడ పట్టణ ఫ్లైఓవర్ ఫైలును క్లియర్ చేయడంతో పాటు బస్టాండ్‌ను ఆధునికరిస్తామని వెల్లడించారు.

ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ పంటలను కాపాడుతూనే హైదరాబాద్ వరకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని, ఎన్ఎస్పి స్థలంలో తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చని, మిర్యాలగూడలో రూ. 11 కోట్ల సబ్సిడీతో సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సుధ, ఆర్డీవో రమణారెడ్డి, పౌరసరఫరాల డీఎం రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేష్, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>