కలం, నిర్మల్: ఖతార్ దేశంలో పోలీసుల కస్టడీలో ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు గల్ఫ్ కార్మికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్రెడ్డి (Alleti Maheshwar Reddy) చొరవ తీసుకున్నారు. దిలావర్పూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచపు గణేష్, సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దేశభోయి సంపత్ ఖతార్ లో పోలీసుల కస్టడీలో ఉన్న విషయాన్ని ఆ గ్రామాల బీజేపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించి వారి విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం స్పందించి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, దోహా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం, నిర్మల్ జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది.
వీలైనంత త్వరగా ఇద్దరు కార్మికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఇద్దరు గల్ఫ్ కార్మికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు ఈ అంశాన్ని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

