కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : యువత భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి రాము పిలుపునిచ్చారు. షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ (Bhagat Singh) జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండపల్లి రాము మాట్లాడుతూ.. భగత్ సింగ్ కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి, లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా సాండర్స్‌ను హతమార్చడం, అసెంబ్లీలో బాంబు విసిరి బ్రిటిష్ ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేయడం ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమన్నారు. జైలులో ఉన్న సమయంలోనూ ఖైదీల హక్కుల కోసం 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన గొప్ప త్యాగశీలి భగత్ సింగ్ అని కొనియాడారు.
నేటి యువత భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల ఆశయాలతో పాటు వారి సోషలిజం, సమానత్వ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని రాము సూచించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారని ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. దీంతో అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
మరోవైపు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయికి యువత బానిసలవుతుండటంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సాధ్యమవుతుందని కొండపల్లి రాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు బి. మహేష్ బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ పాలమూరు యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి, శివ నాయక్, నరేష్, లెక్చరర్ శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : సీఎం విజయ్ సరికొత్త స్కీమ్.. పసిబిడ్డలకు ఫ్రీ గోల్డ్ కానుక!
Follow Us On: X(Twitter)

