కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: డిండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు సాగునీటిని తరలించాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని, డిండి ద్వారా నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించొద్దని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. ఆదివారం ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో రైతులు, జేఏసీ నాయకులు ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీకే అరుణ పాల్గొన్నారు.
పాలమూరు ప్రాజెక్టు నుంచి 14 నియోజకవర్గాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు సాధించుకున్నామని, తెచ్చుకున్నామని డీకే అరుణ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి ద్వారా నల్గొండ జిల్లాకు నీటి తరలింపును ఆపాలని రైతులు, అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి పాదయాత్ర ప్రారంభించారని అన్నారు. అనేక పోరాటాలతో జిల్లాకు ప్రాజెక్టులు వచ్చినా ఇప్పటికీ పూర్తి కాలేదని ఆమె అన్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. డిండి లిఫ్ట్ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్తున్నారని, పాలమూరు జిల్లా రైతులు నీళ్లు లేక దీనస్థితిలో ఉన్నారని డీకే అరుణ అన్నారు.
నల్గొండ ప్రజలు డిండి నీళ్లు కావాలని అడగలేదని, డిండి కంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నల్గొండకు నీళ్లు తీసుకువెళ్లవచ్చని డీకే అరుణ అన్నారు. డిండి వైపు నీళ్లు తరలిపోతే పాలమూరు రైతాంగం నష్టపోతుందని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని, డిండి ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. ఆగిపోయిన డిండి లిఫ్ట్‌ను మొదలు పెట్టడం అంటే పాలమూరు ఎండిపోయినా నల్గొండకు నీళ్లు ఇవ్వడమేనా అని డీకే అరుణ ప్రశ్నించారు. జిల్లా వ్యక్తి జిల్లాకు నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
డిండి ప్రాజెక్టును ఖచ్చితంగా ఆపాల్సిందేనని, ఆపే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సమితి జేఏసీ స్పష్టం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి డీపీఆర్ ప్రకారం లక్ష్మీదేవిపల్లికి నీళ్లు ఇవ్వాలని డీకే అరుణ ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు రైతులు, ప్రజల భవిష్యత్ తరాలు బాగుండాలంటే ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి సాగునీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుతామని కేసీఆర్ మాదిరి మాయ మాటలు మానుకోవాలని అన్నారు. కృష్ణా నీళ్లు పక్కనుంచి వెళ్తున్నా నీళ్లు ఇవ్వలేకపోవడం చేతకానితనమే అవుతుందని దుయ్యబట్టారు. ఈ పాదయాత్రలో డీకే అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆచారి, వీర బ్రహ్మచారి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జేఏసీ నేతలు జి. రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి, బెక్కెం జనార్ధన్, బాధిత రైతులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

