కలం, కరీంనగర్: ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (Karimnagar Urban Bank) సర్వసభ్య సమావేశం ఆదివారం కలెక్టరేట్ రోడ్డులోని రెవిన్యూ గార్డెన్స్‌లో పర్సన్ ఇన్ ఛార్జ్ (PIC) కమిటీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది. ఈ నెల 13న నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడం వల్ల వాయిదా పడిన విషయం విదితమే. ఆ రోజు ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా దానికి అనుసంధానంగా ఆదివారం రెవిన్యూ గార్డెన్స్‌లో ప్రతినిధులు, సభ్యుల సమక్షంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బ్యాంక్ సజావుగా నిర్వహించేందుకు, అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన ఎజెండా అంశాలను ఈ సమావేశంలో చర్చించి, సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో తీర్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మాట్లాడుతూ, బ్యాంక్ పురోగతికి సభ్యులందరి సహకారం అభినందనీయమని, బ్యాంకును మరిన్ని లాభాల దిశగా పయనించేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు డైరెక్టర్లు, ప్రతినిధులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, ముద్దసాని క్రాంతి, మూల లక్ష్మి, లక్ష్మణ రాజు, విద్యాసాగర్, రేగొండ సందీప్, ఎండీ షాముద్దీన్, మంగి రవీందర్, నాగుల సతీష్, మార్కారాజు, బ్యాంక్ సీఈవో నునుగొండ శ్రీనివాస్, బ్యాంక్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

