కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఓట్ల చోరీ ఎప్పటికీ చేయబోదని.. ఓటర్ల మనుసులు గెలుచుకుంటుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే తన ఘనత.. ఓడిపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిందించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఈసీపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు దారుణమని.. రాజ్యాంగ సంస్థపై మాట్లాడే హక్కు రాహుల్ గాంధీకి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను రాహుల్ వదిలిపెట్టకుండా పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నారని.. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 2009లో తాను చెప్పినట్లుగా వినడం లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్లను మార్చాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయం కాంగ్రెస్ నేతలు మర్చిపోయారా.. అని ప్రశ్నించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని.. ఎన్నికల సంఘం తప్పు చేసి ఉంటే ఎలా గెలుస్తారని విమర్శించారు.
గాంధీ కుటుంబం సేవలో రేవంత్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాలు వదిలేసి గాంధీ కుటుంబం సేవలో తరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ నాయకుడైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని చెబుతారని.. రేవంత్ రెడ్డి మాత్రం కేరళ వెళ్లి గాంధీ కుటుంబం కోసం ప్రాణాలు అర్పిస్తా అని చెబుతుండటం సిగ్గు చేటన్నారు. ఈ దేశాన్ని తన కుటుంబమే పాలించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. బెంగాల్‌లో జరిగిన సర్ ప్రక్రియ పూర్తిగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే జరిగిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. 2 కోట్ల మంది నకిలీ ఓట్లను తొలగిస్తే తప్పేంటని.. అన్ని వివరాలు సరి చూశాకే.. తొలగింపు ప్రక్రియ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలు అర్దరహితమని కొట్టిపారేశారు.

