యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించిన భట్టి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, వచ్చే మార్చి నాటికి పాఠశాలల నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌లతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​

అందరూ ఒకే చోట..

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ, ధనిక-పేద తారతమ్యాలు లేకుండా అందరికీ ఒకే చోట గుణాత్మక విద్యను అందించడమే ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశమని అన్నారు. అందరూ ఒకే చోట చదువుకున్నప్పుడే సమాజంలో ‘వసుధైక కుటుంబ’ భావన పెంపొందుతుందని, అక్షరమే ఆయుధంగా అంతరాలు లేని సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్య ద్వారానే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం దక్కుతాయని తెలిపారు.

మార్చి నాటికి పనులన్నీ పూర్తి..

​పరిశీలనలో భాగంగా తరగతి గదులు, హాస్టల్ సముదాయాలు, ల్యాబ్‌లు, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణ పురోగతిని డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, జూనియర్ హాస్టళ్లు పూర్తికాగా, అకాడమిక్ బ్లాకులు, సీనియర్ హాస్టళ్లు, డైనింగ్ హాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా, నిర్మాణ కార్మికుల సంఖ్యను పెంచి వచ్చే మార్చి నాటికి పనులన్నీ పూర్తి చేసి పాఠశాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ​

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, విద్యాశాఖ, విద్యుత్, ఆర్‌అండ్ బి, పిఆర్‌ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>