కలం, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో (Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఇటీవలే సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలపై దృష్టి సారించింది.
రెండోసారి బ్రహ్మోత్సవాలు
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధికమాసం కారణంగా ఈ ఏడాది శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు(Navaratri Brahmotsavam) నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కన్యామాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి.
దసరా సందర్భంగా ఆశ్వయుజ మాసంలో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరగనున్నాయి. అయితే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవని టీటీడీ స్పష్టం చేసింది.
వాహన సేవలతో భక్తులకు దర్శనం
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వివిధ వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాధారణంగా ఉదయం వాహన సేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి సేవలు సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆయా రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
అక్టోబరు 16న గరుడసేవ
ఉత్సవాల్లో అక్టోబరు 16న నిర్వహించే గరుడ వాహన సేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సేవ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు కొనసాగనుంది. అక్టోబరు 19న స్వర్ణరథం సేవ నిర్వహించనున్నారు. చివరి రోజైన అక్టోబరు 20న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవల పూర్తి షెడ్యూల్..
. అక్టోబరు 11- అంకురార్పణం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు
. అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం ఉదయం 9 గంటలకు
. పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 13 – చిన్నశేష వాహనం ఉదయం 8 గంటలకు
. హంస వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 14 – సింహ వాహనం ఉదయం 8 గంటలకు
. ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం ఉదయం 8 గంటలకు
. సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 16 – మోహినీ అవతారం ఉదయం 8 గంటలకు
. గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు
. అక్టోబరు 17 – హనుమంత వాహనం ఉదయం 8 గంటలకు
. పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు
. గజ వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం ఉదయం 8 గంటలకు
. చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 19 – స్వర్ణరథం ఉదయం 7 గంటలకు
. అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
. అక్టోబరు 20 – చక్రస్నానం ఉదయం 6 గంటలకు

