కలం, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు, నియోజకవర్గ అభ్యర్థి రావు పద్మారెడ్డి (Rao Padma Reddy) అన్నారు. శుక్రవారం హంటర్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేంద్ర మంత్రులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 59వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని పద్మారెడ్డి ఖండించారు.
అధికారంలో ఉన్నామనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలు, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని పద్మారెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషితోనే కాజీపేట వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, రామప్పకు యునెస్కో గుర్తింపు, వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ, మామునూరు విమానాశ్రయం తదితర అంశాల్లో పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. సమావేశంలోనాయకులు సండ్ర మధు, నర్మెట్ట శ్రీనివాస్‌రావు గౌడ్, సంపత్ రెడ్డి, మాలోత్ నాను నాయక్, మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జితేందర్, రోకుల సతీష్ పాల్గొన్నారు.

