కలం, హుజూర్ నగర్: కేంద్ర ఎన్నికల సంఘంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో దేశమంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే ఆశగా చూస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తమ నేత రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు.
తాజాగా చోటుచేసుకున్న ఉదంతాలపై ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే తిరుగుబాటు చేయడం చూస్తుంటే, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని దేశ రాజకీయ వ్యవస్థలు సైతం గుర్తిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆ ధైర్యం రాహుల్ గాంధీకే ఉంది..
దేశంలో అధికార అహంకారాన్ని, రాజకీయ వేధింపులను తట్టుకుని నిలబడే ఏకైక ధైర్యం రాహుల్ గాంధీకే ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. రాజ్యాంగానికి రక్షణ కవచంగా, ప్రజాస్వామ్యానికి ఆశాకిరణంగా నిలిచిన ఆయనను భవిష్యత్ ప్రధానిగా స్వాగతించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని అణచివేయాలని చూసిన ప్రతిసారీ ఆయన గొంతు మరింత బలపడిందని, అడుగులను అడ్డుకున్న కొద్దీ ప్రజలు ఆయనకు మరింత చేరువయ్యారని తెలిపారు.
విమర్శలను శత్రుత్వంగా, భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా చిత్రీకరిస్తూ ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యం కాదని, అది నియంతృత్వమని మంత్రి విమర్శించారు. ‘ఓట్ చోరీ’పై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు భద్రంగా ఉండేలా ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం భయాన్ని పెంచి విభజన రాజకీయాలు చేస్తే… కాంగ్రెస్ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఐక్యతా సిద్ధాంతంతో ముందుకు సాగుతోందన్నారు.
రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగుల కన్నీటిని తన పోరాటంగా మార్చుకున్న నాయకుడు రాహుల్ గాంధీ అని ఉత్తమ్ కొనియాడారు. దేశానికి ఇప్పుడు ఆయన నాయకత్వమే అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడంలో తెలంగాణ నిర్ణయాత్మక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గ్రామాన్ని పార్టీ కోటగా మార్చి, రాజ్యాంగ పరిరక్షణ సైనికులుగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.

