కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల (Asian Games) ఫెన్సింగ్‌లో భారత్‌కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సేబర్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలవడంతో ఈ క్రీడల్లో మనదేశ ప్రయాణం ముగిసింది. సరికొత్త రికార్డుతో అత్యధికంగా 20 మంది క్రీడాకారులతో బరిలోకి దిగినా, భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు. మహిళల సేబర్ టీమ్ పోటీల్లో భవానీ దేవి, శ్రేయ గుప్తా, జెఫార్లిన్, శృతి జోషిల బృందం తొలి రౌండ్లో ఇండోనేషియాపై 45-23తో విజయం సాధించింది.
అయితే క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ చేతిలో 45-35 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన పురుషుల సేబర్, మహిళల ఫాయిల్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల సేబర్ జట్టు క్వార్టర్స్‌లో దక్షిణ కొరియా చేతిలో, మహిళల ఫాయిల్ జట్టు జపాన్ చేతిలో ఓటమి పాలయ్యాయి. మరోవైపు పురుషుల ఫాయిల్, మహిళల ఎపీ జట్లు రౌండ్ ఆఫ్ 16లోనే వెనుదిరిగాయి. అంతకుముందు జరిగిన వ్యక్తిగత విభాగాల్లో స్టార్ ఫెన్సర్ భవానీ దేవి రౌండ్ ఆఫ్ 16 వరకు చేరుకున్నా, చైనా అథ్లెట్ రావ్ క్స్యూయి చేతిలో ఓడిపోయారు. శ్రేయ గుప్తా కూడా రౌండ్ ఆఫ్ 16లోనే వెనుదిరిగారు. మిగతా ఏ భారత క్రీడాకారుడు కూడా క్వార్టర్స్‌కు చేరలేకపోయారు.

