కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లా వాసి, 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత భద్రాచలం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ (Narayanpet IAS Rahul) విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్నారు. గిరిజనులు, రైతులు తమ ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. 2024 జూన్ 24న భద్రాచలం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గిరిజనులు, రైతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఐటీడీఏ పరిధిలోని మహిళా సంఘాలు, గిరిజనులు, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు 2026 మార్చి 27న భద్రాద్రి మార్ట్‌ను (Bhadradri Mart) ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరెం కనకయ్య తదితరుల సమక్షంలో మార్ట్ ప్రారంభమైంది.
భద్రాచలం సీతారామస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలో భద్రాద్రి మార్ట్ ఏర్పాటు చేయడంతో పర్యాటకులు, స్థానికులు గిరిజనులు, రైతులు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్ట్‌లో విక్రయించిన ఉత్పత్తులకు ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో గిరిజనులు, రైతులకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజనులు, రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో బి. రాహుల్‌ను ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అవార్డు
భద్రాద్రి మార్ట్ ద్వారా గిరిజనులు, రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించినందుకు బి. రాహుల్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా అవార్డు అందించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఈ అవార్డును స్వీకరించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా అవార్డు అందుకున్న బి. రాహుల్ తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా మరో అవార్డు అందుకోవడం విశేషం.

