ఎర్రవల్లిలో భూముల సర్వే పూర్తి.. నివేదికపై ఉత్కంఠ

కలం, మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి (Erravalli) గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse) పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, సర్వే అధికారులు చేపట్టిన భూముల సర్వే పూర్తయింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే శాఖల ప్రత్యేక బృందాలు సుమారు ఎనిమిది రోజుల పాటు సర్వే నిర్వహించాయి. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న సుమారు 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన హద్దులు, కొలతలను అధికారులు గుర్తించారు. తొలుత ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాలకు సంబంధించిన రికార్డులను రెండు రోజుల పాటు పరిశీలించారు. అనంతరం సర్వే పరిధిలోని భూములకు సంబంధించిన 240 మందికి పైగా రైతులకు నోటీసులు జారీ చేసి, క్షేత్రస్థాయిలో భూముల వివరాలు, హక్కు పత్రాలు, పట్టాదార్ పాస్‌పుస్తకాలను పరిశీలించారు.

గజ్వేల్ ఆర్డీవో పర్యవేక్షణలో తహసీల్దార్, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి భూముల హద్దుల గుర్తింపు, శాటిలైట్ మ్యాపింగ్, సేత్వార్ రికార్డుల ఆధారంగా కొలతలు చేపట్టారు. ఎర్రవల్లిలో నిర్వహించిన సర్వే వివరాలను అధికారులు క్రోడీకరించి మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వ్యవహారం అసెంబ్లీలో చర్చకు రావడంతో ఈ సర్వేపై రాజకీయంగా కూడా ఆసక్తి నెలకొంది. అధికారులు సమర్పించనున్న నివేదికలో ఎలాంటి వివరాలు ఉంటాయన్న దానిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>