ప్రభుత్వ బడుల దుస్థితిపై టీపీఎఫ్ ఆందోళన

కలం, నల్లగొండ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ, ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల నియంత్రణ లక్ష్యంగా టీపీఎఫ్ చేపట్టిన 12 రోజుల ‘విద్యా బస్ యాత్ర’లో భాగంగా శనివారం నల్లగొండలోని (Nalgonda) లయన్స్ క్లబ్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం (TPF Round Table Meet) నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ నేత నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పులు కనిపించడం లేదన్నారు. అరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో ప్రతి మండలంలో 21వ శతాబ్దానికి అనుగుణంగా మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో పెరిగిన అధిక ఫీజులను తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేశారు.

యాత్రలో భాగంగా మాడుగులపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో టీపీఎఫ్ నిర్వహించిన ‘బడి నిద్ర’ కార్యక్రమంలో పాఠశాలల క్షేత్రస్థాయి పరిస్థితులు వెలుగులోకి వచ్చాయని నాయకులు తెలిపారు. ఐదు ఎకరాల పాఠశాల ప్రాంగణంలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, యునాని ఆసుపత్రి, ఉపాధి హామీ కార్యాలయాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కేవలం ఒకే గది, కుళాయిలు లేని నీటి వసతి, శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. 500 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కూడా ఒక్క అటెండర్ లేకపోవడం ప్రభుత్వ విద్యాశాఖ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు.

ఆకునూరి మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాభివృద్ధిపై అధికారిక వేదికల్లో గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. టీపీఎఫ్ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఎం. చంపాలాల్ మాట్లాడుతూ తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజ షా, సృజన యాదవ్, ముప్పూరి కుమారన్న, నిఖిల్ విజయ కృష్ణతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>