కలం, నల్లగొండ: నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంకు (MG University) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అండగా నిలిచింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ అవసరాల కోసం నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను (Electric Vehicles) శనివారం అందజేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బీఐ నల్లగొండ డిప్యూటీ జనరల్ మేనేజర్ (బీఅండ్‌వో) ప్రియబ్రత మిశ్రా, రీజినల్ మేనేజర్ పి. పద్మబాబు గౌడ్ పాల్గొని వాహనాలను ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. అంజిరెడ్డికి అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ అంజిరెడ్డి ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ కార్యక్రమానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు క్యాంపస్ అవసరాలకు ఈ-వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అనంతరం ఎస్‌బీఐ ప్రతినిధులు, వర్సిటీ అధ్యాపకులు కలిసి క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్‌లు శ్రీమన్నారాయణ, కె. శ్రీరామ్, మేనేజర్ అనిల్, అన్నెపర్తి శాఖ మేనేజర్ చైతన్యతో పాటు ఎంజీయూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ అరుణప్రియ, డాక్టర్ హరీష్ కుమార్, ఆచార్యులు వసంత, శ్రీదేవి, అధ్యాపకులు, వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

