బీఆర్ఎస్‌పై వనపర్తి కాంగ్రెస్‌ నేతల ధ్వజం

కలం, వనపర్తి: ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన నాయకుడినే ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ (BRS) నేతలకు కనీసం ఆత్మవిమర్శ కూడా లేకుండా పోయిందని వనపర్తి కాంగ్రెస్‌ నాయకులు (Wanaparthy Congress) విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం నాటి మాటలను నేడు మరిచిపోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పార్టీ అధికార ప్రతినిధి వాల్యనాయక్‌ తదితరులు మాట్లాడారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే నాయకుడితో కలిసి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం ఏ రకమైన రాజకీయమని మధుసూదన్‌గౌడ్‌ ప్రశ్నించారు. నిరంజన్‌ రెడ్డిపై భూకబ్జాలు, అక్రమాలు, దందాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు, సామాజిక వర్గాలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. నందిమల్ల అశోక్‌ చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై సంబంధిత వ్యక్తులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

రైతులకు నీళ్లొస్తే ఎందుకంత కడుపుమంట?

వనపర్తి నియోజకవర్గ ప్రజలకు బీఆర్‌ఎస్‌ నేతల గత వ్యవహార శైలి, పాలన తీరుపై పూర్తి అవగాహన ఉందని వాల్యనాయక్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చర్యలతో కేఎల్‌ఐ ద్వారా రైతులకు సాగునీరు అందిన చరిత్ర ఉందన్నారు. కేఎల్‌ఐ కాలువలు దెబ్బతిన్న సమయంలో అప్పటి కాంట్రాక్టర్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి మరమ్మతులు చేయించి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి సాగునీటి అంశంపై చర్చించడం రైతుల ప్రయోజనాల కోసమేనని తెలిపారు.

రైతులకు నీరు అందించే ప్రయత్నాలను అభినందించాల్సింది పోయి బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ విమర్శలకు దిగడం సరికాదన్నారు. రైతులకు నీళ్లు అందితే తమ రాజకీయ వైఫల్యం బయటపడుతుందనే భయంతోనే విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి రమేష్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ బి.కృష్ణ, పాకనాటి కృష్ణ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, జనార్ధన్‌సాగర్‌, కౌన్సిలర్లు పితంబర్‌, ధనలక్ష్మి, విజయలక్ష్మి, మహేశ్వరి, మండల అధ్యక్షుడు నక్క రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>